14-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు, మే 6: బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుకి, జగన్‌కి ఇద్దరికీ మోడీ కావాలని, ఇద్దరూ మోడీని పట్టుకొని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని పలు కూడళ్లలో నిర్వహించిన ప్రచారంలో ఆమె ప్రసంగించారు. ఎంపి అవినాష్‌రెడ్డి ఏనాడైనా ప్రజల కోసం కొట్లాడారా? ఎంపిగా కడప స్టీల్ కోసం పోరాటం చేశారా? అని ప్రశ్నించారు.
ఆయన కోసం తప్ప ప్రజల కోసం ఏనాడు ఢిల్లీకి వెళ్లలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుస్తారని జగన్‌కి ఓటు వేస్తే నెత్తిన కుచ్చుటోపీ పెట్టారని అన్నారు. సొంత చిన్నాన్న వివేకా హత్యకేసు నిందితుడికి మళ్ళీ పట్టం కట్టారని, వైఎస్‌ఆర్, వివేకా వంటి ప్రజా నాయకులు మళ్ళీ దొరకరని తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే యధేచ్చగా బెట్టింగ్‌లు, గుట్కా, మట్కా వ్యాపారం, దొంగనోట్ల బిజినెస్ చేస్తూ మూడు పువ్వులు..ఆరు కాయలుగా దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు.
దోచుకునే వారు ఎవరు? పని చేసే వారు ఎవరు? అనేది ఆలోచన చేసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నజీర్ ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీల ద్వారా అభివృద్ధి జరగదని, విభజన హావిూలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీకి మద్దతివ్వాలని కోరారు. ఆమ్ ఆద్మీ తరపున పోటీలో ఉన్న దస్తగిరి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.