14-05-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, మే 14: నిజామాబాద్‌లో గెలుపు తమదంటే తమదన్న భావనలో ముగ్గురు నేతలు ఉన్నారు. ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. రాత్రి 10 గంటల వరకు నిజామాబాద్‌లో 71.47 శాతం, జహీరాబాద్‌లో 72.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారనున్నదనే అంశంపై జోరుగా చర్చ సాగుతున్నది. జూన్ 4వ తేదీన ప్రజాతీర్పు వెలువడనున్నది. నిజామబాద్ జిల్లా ప్రచారంలో పసుపుబోర్డు అంశమే ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు నేతలు ధీమాగా ఉన్నారు. గెలుపు తమదంటే తమదన్న రీతిలో ఉన్నారు.
అయితే పసుపుబోర్డు ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. దాని పనితనం మొదలు కాలేదు. పసుపు రైతులకు మేలు జరగలేదు. పసుపుబోర్డు పేరుతో అర్వింద్ మోసం చేశారని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు తమ ప్రచారంలో ఎదురుదాడికి దిగారు. జీవన్ రెడ్డి, బాజిరెడ్డిలు ఇద్దరూ బిజెపి లక్ష్యంగా ప్రచారంల చేశారు. అయితే పెరిగిన ఓటువాతం ఎవరికి అనుకూలం అన్న చర్చ చేస్తున్నారు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో జనం భారీగా తరలివచ్చి ఓటేశారు. తొలి రెండు గంటలు మందకొడిగా సాగిన పోలింగ్.. తొమ్మిది గంటల తర్వాత ఊపందుకుంది. సాయంత్రం వరకూ అదే రద్దీ కొనసాగింది.
కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా ఓటర్లు లైన్‌లో ఉండడంతో వారికి ఓటేసే అవకాశం కల్పించారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా పల్లెల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరగా, పట్టణ వాసులు సైతం ముందుకొచ్చారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. చల్లబడ్డ వాతావరణం కూడా పోలింగ్ పెరగడానికి కారణమైంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ప్రధానంగా గెలుపు తనదే అన్న ధీమాలో ఉన్నారు. మోడీ ఛరిష్మాతో గెలుపు బిజెపిదేనని అర్వింద్ అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్, బిజెపిలతో విసిగి పోయారు కనుక మళ్లీ కెసిఆర్ కోసం తనకు ఓటేశారని బాజిరెడ్డి నమ్ముతున్నారు.