14-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 14: యాసంగి ధాన్యంలో మిల్లర్ల దోపిడీని నియంత్రించాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్ చేసింది. రైకొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించాలని కోరుతున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు కనీసం రెండురోజులు మిల్లుల వద్ద కూర్చోని ధాన్యం దిగుమతి వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, మిల్లర్ల దోపిడీని నియంత్రించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. క్వింటా ఒక్కింటికి పదికిలోల ధాన్యం అక్రమ కటింగ్ చేస్తున్న మిల్లర్లను నియంత్రించాలని, ధాన్యం దిగుమతి చేసుకుంటున్న మిల్లుల వద్ద జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.
యాసంగి సీజన్ వరిధాన్యం కొనుగోలు సందర్భంగా ఒక్క కేజీ కూడా మిల్లర్లు కటింగ్ లేకుండా రైతుల నుంచి ధాన్యం దిగుమతి చేసుకుంటారని అందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు బాధ్యత తీసుకుంటామని చేసిన ప్రకటనలు ఆచరణలో మచ్చుకు కూడా కన్పించటం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం పరిశీలించి అధికారులు ధ్రువీకరణ చేసిన తర్వాత రైతుకు ఎగుమతి, దిగుమతితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ ప్రకటించినప్పటికీ మిల్లర్లు మాత్రం క్వింటా ఒక్కింటికి పదికిలోల కటింగ్ అంగీకరించిన రైతుల ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకొనేందుకు ముందుకొస్తున్నారని ఆక్షేపించారు.