14-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 14: మామిడిపండ్ల ధరలు బేజారెత్తిస్తున్నాయి. సీజన్ ఆరంభమై ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడిపండ్ల రాక మొదలవడంతో డిమాండ్ ఏర్పడి ధరలు చుక్కలనంటుతున్నాయి. హైదరాబాద్‌లో బంగినపల్లి మామిడి పళ్లు కిలో కనీసం వందకు తక్కువగా అమ్మడంలేదు. దీనికితోడు ఎక్కడా పెద్దగా పండ్ల బండ్లు అమ్మకానికి రావడం లేదు. ఈ యేడు పంట దిగుబడులు తగ్గడం బంగినపల్లి, చెరకురసాలు, పందారకల్తీ.. ఇలా ఏ రకమైనా సరే ధర అందనంతగా ఉంది. విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో కాస్త పెద్దసైజువి బంగినపల్లి పరక రూ.500పైనే చెబుతున్నారు. బేరం ఆడితే రూ. 450కు ఇస్తున్నారు. చెరకురసాలు, పందార కల్తీ పరక రూ.350 వరకూ చెబుతున్నారు. దీంతో ధనికవర్గాలకు తప్ప సామాన్యులకు మామిడిపండ్లు ఇప్పట్లో దొరికే పరిస్థితి లేదు.
రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోని మార్కెట్‌యార్డు వద్ద ప్రతి ఏటా మామిడిపండ్ల మార్కెట్ జరుగుతుంది. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలైన కోరుకొండ, నల్లగొండ, కోటి, గోకవరం, రంపయర్రంపాలెం, గంగంపాలెం, తిరుమలాయిపాలెం, జగ్గంపేట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు మామిడిపండ్లు ఎక్కువగా తెస్తుంటారు. ఇక్కడ హోల్‌సేల్, రిటైల్‌గాను మామిడిపండ్లు విక్రయాలు జరుగుతుంటాయి. సైకిళ్లపై అమ్ముకునేవారు ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తుంటారు. కొందరు చిరు వ్యాపారులు స్థానికంగా చిన్న చిన్న రాశులుగా పోసి మామిడిపండ్ల విక్రయాలు చేస్తుంటారు. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లోనే ధరలు ఇలా మండిపోవడంతో మామిడిపండ్ల మామిడిప్రియులకు నిరాశ ఎదురవుతోంది.
కొంతమంది మాత్రం ధర ఎలా ఉన్నా కనీసం పరక పండ్లయినా కొనుగోలు చేస్తున్నారు. మరో వారం, పది రోజులు పోతేనే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మామిడిపండ్ల సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈ ఏడాది మే మొదటి వారంలోనే మార్కెట్లోకి మామిడిపండ్లు వచ్చాయి. తేనె మంచు విపరీతంగా కురవడంతో పూత మాడిపోయి దిగుబడులు తగ్గిపోయాయని మామిడి పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల కూడా సీజన్ ఆలస్యమైనట్టు పేర్కొంటున్నారు. పూత మాడిపోయి దిగుబడి తగ్గడంతో ధరలు కూడా పెరిగాయని, మార్కెట్లోకి మామిడి పండ్లు ఎక్కువగా వస్తేనే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని వీరు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని మామిడి పండ్ల వ్యాపారులు అంటున్నారు.