14-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 14: ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. వేసవి తీవ్రత, వడగాల్పులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇటీవల అక్కడక్కడా జల్లులు కురిశాయి. అయినా చాలాప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు ఇప్పుడు ఎండలతో ఇంటినుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉపాధి హావిూ కార్మికులు ఎండలోనే పనులు చేస్తూ శ్రమను స్వేదంగా చిందిస్తున్నారు. వ్యవసాయ కార్మికుల వలసలను నివారించేందుకు వీలుగా ఈ ఏడాది వారికి కనీస పనిదినాలను కల్పించాలన్న లక్ష్యంతో జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఎండ తీవ్రత అధికంగా ఉన్నా ప్రత్యేక వసతులేవిూ కల్పించడం లేదు. కూలీల రక్షణ చర్యలు తగిన రీతిలో లేవు. ప్రధానంగా మెడికల్ కిట్లు అందుబాటులో లేవు. ఎవరైనా ప్రమాదానికి గురైనా, వేసవి తీవ్రతకు పడిపోయినా ప్రథమ చికిత్స చేసేందుకు తగిన జాగ్రత్తల్లేవు. పంట కాల్వల పనులు ఎక్కువగా చేయిస్తున్నారు. కరోనా కూడా భయపెడుతోంది. మళ్లీ ఎండలో వెళ్లి ఎండలో పనులకు రావడం కష్టంగా ఉందని కూడా కూలీలు వాపోతున్నారు. అధికారులు ఇచ్చే కొలతల ప్రకారం పనులు చేయడం కష్టంగా ఉంది. పలుగులతో కాల్వలను తవ్వేందుకు ప్రయత్నించగా చాలా మంది మహిళా కూలీలు చేతులు బొబ్బలు ఎక్కుతున్నాయి.
ఎండ తీవ్రతకు పలుగులు కూడా కాలిపోతున్నాయని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీటిని పట్టుకుని తవ్వకాలు నిర్వహించలేకపోతున్నామని మహిళా కూలీలు వాపోతున్నారు. మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంది. తాగునీటిని కార్మికులు వారి ఇళ్ల నుంచే తీసుకువెళ్తున్నారు. వేతనాలు ప్రతి రెండు వారాలకు ఒకసారి చెల్లించాల్సి ఉండగా ఆరేడు వారాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో వేతనాలు రావడం లేదని కార్మికులు చెబుతున్నారు. పనులు జరిగే ప్రదేశాల్లో విశ్రాంతి కోసం టెంట్లు వేయాలన్న నిబంధనలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వడదెబ్బ తగిలి ఉపాధి కూలి మృతి చెందినా కనీస సౌకర్యాల కల్పనలో జిల్లా యంత్రాంగం పట్టించు కోవడం లేదు. ఉపాధి కూలీల రక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.