15-05-2024 RJ
సినీ స్క్రీన్
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 2019లో ’ఇస్మార్ట్ శంకర్’ సినిమా పెద్ద విజయం సాధించింది. అటు రామ్ కీ, ఇటు పూరి జగన్ కి ఆ సినిమా ఒక పెద్ద బ్రేక్ ఇవ్వటమే కాకుండా, ఎన్నాళ్ళ నుండో విజయం కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్ ఆ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. ఆ సినిమాలో రామ్ తెలంగాణ యాస మాట్లాడి ఒక మాస్ పాత్రలో ప్రేక్షకులని ఎంతగానే ఆకట్టుకున్నారు. పూరి జగన్ ఆ సినిమాలో రామ్ కి ఎంత హైప్ ఇవ్వాలో అంత ఇచ్చి, రామ్ కెరీర్ లో ’ఇస్మార్ట్ శంకర్’ ఒక మరపురాని చిత్రంగా మలిచారు. మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ’డబుల్ ఇస్మార్ట్’ అని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది, రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుండి ఒక టీజర్ ను విడుదల చేశారు.
రామ్ కి ఈ ’డబుల్ ఇస్మార్ట్’ మళ్ళీ ఒక మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ’ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ సినిమాలు అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఇప్పుడు ఈ ’డబుల్ ఇస్మార్ట్’ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంకో పక్క దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో మళ్ళీ విజయం సాధించాలని చూస్తున్నారు. అందుకనే ఈ సినిమాపై దృష్టి పెట్టి ఎలా అయినా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమానుండి విడుదలైన టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండిరగ్ అవుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదలైంది. బాలీవుడ్ కి చెందిన సంజయ్ దత్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండగా, కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.