15-05-2024 RJ
సినీ స్క్రీన్
తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని నటి మెహరీన్ పిర్జాదా మండిపడ్డారు. సోషల్ విూడియా వేదికగా వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇటీవల ఆమె ’ఎగ్ ఫ్రీజింగ్’ గురించి వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. దానిపై కొన్ని విూడియా సంస్థలు తప్పుడు వార్తలు రాశాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన మెహరీన్.. అసహనం వ్యక్తం చేశారు. ’కొన్ని విూడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకుని వార్తలను ప్రచురించండి. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం అనైతికమే కాదు.. చట్ట విరుద్ధం. ఇటీవల నేను పెట్టిన ’ఫ్రీజింగ్ ఎగ్స్’ పోస్ట్‌పై కొందరు రకరకాల వార్తలు రాశారు. నేను ధైర్యం చేసి ఈ విషయం గురించి మాట్లాడాను.
ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. బాధ్యతయుతమైన సెలబ్రిటీగా కొందరికి దీని గురించి అవగాహన కల్పించడం కోసం పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. దీని గురించి తెలియకుండా విూ స్వార్థం కోసం తప్పుడు కథనాలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాపై పెట్టిన పోస్ట్‌లను తొలగించండి. బహిరంగ క్షమాపణలు చెప్పండి’ అని మెహరీన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.