16-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పల్నాడు, మే 16: పల్నాడులో పెట్రో బాంబుల కలకలం రేపాయి. వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తింంచారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. ఎన్నికల అనంతరం పల్నాడులో చెలరేగిన హింసతో పోలీసులు విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో వరుసగా పెట్రోల్ బాంబులు లభ్యమవుతుండటంతో అలజడి నెలకొంది. బుధవారం రాత్రి మాచవరం మండలం పిన్నెళ్లి గ్రామంలో వైకాపాకు చెందిన ఐదుగురి నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు.. గురువారం ముప్పాళ్ల మండలం మాదలలో తనిఖీలు చేస్తుండగా వైకాపా నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబుల్ని గుర్తించారు.
ఎన్నికల వేళ దాడుల కోసం ఈ బాంబుల్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. అలజడి సృష్టించి ప్రజల్ని భయాందోళనకు గురిచేసి రాజకీయ లబ్ది పొందేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వైకాపా నేతల ఇళ్లల్లో వరుసగా పెట్రోల్ బాంబులు బయటపడుతుండటంతో పోలీసుల్లోనూ అలజడి మొదలైంది. పోలింగ్ రోజు జరిగిన దాడుల విషయంలో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించినప్పటికీ.. హింసాత్మక ఘటనలతో అధికారుల తీరుపట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడం, సీఎస్, డీజీపీలను వివరణ ఇవ్వాలంటూ సమన్లు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈసీ ఆదేశాల మేరకు దాడుల్ని నియంత్రించేందుకు పల్నాడు జిల్లాలో నిన్న 144 సెక్షన్ విధించి ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేశారు. ఇందులో భాగంగానే సమస్యాత్మకంగా వున్న గ్రామాల్లో తనిఖీలు చేస్తుండటంతో వైకాపా నేతల ఇళ్లలో ఇలా పెట్రోల్ బాంబులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.