16-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 16: తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్, హైదర్‌నగర్, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్‌నగర్, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏకధాటిగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి.
వర్షానికి జనజీవనం స్థంభించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, హిమాయత్ నగర్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. మరోవైపు, వచ్చే 5 రోజులపాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.విూల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో విూటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.