16-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 16: రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు.. మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భంలో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పథక అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా సూచించారు. మరోవైపు.. పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరాకు విధివిధానాల రూపకల్పన చేశారు. వెంటనే సరఫరా ప్రారంభించి, సరఫరాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడగలరని టీఎస్ సీడ్స్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
మొదటి విడత పంటనష్ట పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తయినందున, రెండోవిడత ఏప్రిల్ మాసములో, మూడోవిడత మే మాసములో జరిగిన పంట నష్ట వివరాల సమర్పణకు ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మట్టి నమూనా పరీక్షా కేంద్రాల సామార్థ్యం అనుసరించి, వెంటనే రైతుల విజ్ఞప్తి మేరకు అవసరమున్న రైతుల పొలాల మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందచేసేటందుకు ప్రణాళిక చేసుకోవల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వరి కొయ్యలు కాల్చకుండా యుద్ధప్రాతిపదికన రైతులకు అవగాహన కల్పించడం, అప్పటికీ వినకపోతే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వరికొయ్యలు తగలపెడితే జరిమానాలు విధించాల్సిందిగా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్ళను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేసేవిధంగా ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు.. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేటాయించిన భూములలో ఆధునిక సాంకేతికతతో పండ్లతోటల పెంపు మరియు నిర్వహణ బాధ్యతలు తీసుకొనే విధంగా ఆదేశాలు జారీ చేశారు.ఆయిల్ ఫాం కంపెనీల పనితీరు ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. మల్బరీ సాగుకు అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలలో మ్యాచింగ్ గ్రాంటు బకాయి నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అన్ని రకాల సహకార సంఘాలలో సభ్యుల గుర్తింపు మరియు పదవీకాలం ముగిసిన సంఘాల ఎన్నికల నిర్వహణకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.