16-05-2024 RJ
తెలంగాణ
రాజన్న సిరిసిల్ల, మే 16: రాష్ట్రమంతటా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు పిడుగులతో వర్షాలు పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికిపిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌లో పిడుగుపాటుకు రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో కంబాల శ్రీనివాస్ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు రహదారుల పక్కన చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిరచిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. ఇదిలావుంటే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వట్ పల్లి, కోహిర్ మండలాల్లో వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడిరది. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంట వ్యవధిలో సంగారెడ్డి పట్టణం తడిసి ముద్దయింది. రోడ్లపై భారీగా పారుతున్న వరద నీటితో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షపు నీరు భారీగా నిలిచింది.
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారానికి పలు చోట్లు చెట్ల కొమ్మలు విరిగిపడగా.. బారికేడ్లు నెలకొరిగాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరిపొలాలు కోసి ధాన్యాన్ని కుప్పగా పోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.