16-05-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, మే 16: అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే విశ్వాసం కోల్పోయారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే వరంగల్`నల్గొండ`ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన తరఫున పార్టీకి చెందిన కీలక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి ఈటల రాజేందర్ హాజరై.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందన్నారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతికి, దందాలకు అడ్డులేదని.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్దిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే గొంతుక లేకుంటే అధికార పక్షానిదే ఏకపక్షం అవుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.