16-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 16: హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలవగా.. అనేక చోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలాలు పొంగడంతో వాహనాలు కొట్టుకు పోయాయి. పలు ప్రాంతాల్లో మూసీ నాలాలు పొగాయిన జిహెచ్‌ఎంసి అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. మాదాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. రోడ్లపై పలుచోట్ల మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. సైబర్ టవర్స్ వద్ద వరదనీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించగా.. మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు మెల్లగా కదిలాయి.
మాదాపూర్ నెక్టార్ గార్డెన్స్, శిల్పారామం సైబర్ గేట్‌వే రోడ్లపై వరదనీరు చేరింది. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద వరదనీరు భారీగా చేరింది. రైల్వే అండర్ పాస్ కింద నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. దిల్‌సుఖ్‌నగర్ `కోఠి మార్గంలో వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మలక్‌పేట రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం వర్షం తెరిపిచ్చినప్పటికీ.. రాత్రికి వడగళ్లతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నగరంలో భారీ వర్షం కురువడంతో వరదలతో హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నం.9లో నాలాపై రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఉదయ్‌నగర్‌లో నాలా పైకప్పు కూలింది. వరద నీటిలో పలు ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. నాలా కూలిన ప్రాంతాల్ని మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు బల్కంపేట రైల్వే అండర్‌పాస్ కింద వరదనీటిలో కారు మునిగిపోయింది. రాత్రి వేళ పలు చోట్ల వడగళ్ల వాన పడుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లతో కమిషనర్ రోనాల్డ్ రాస్ సవిూక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఆలస్యంగా వెళ్లాలని కమిషనర్ సూచించారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.