16-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 16: ఓ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం వల్లే థియేటర్లలో ప్రస్తుతం సినిమాలు ప్రదర్శితం కావడం లేదని వస్తున్న వార్తలను టీఎఫ్‌పీసీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఖండించింది. అది థియేటర్ల యజమానుల వ్యక్తిగతమని పేర్కొంది. ఈమేరకు టీఎఫ్‌పీసీ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గుంటూరు సహా ఆంధ్రాలోని పలువురు సినిమా థియేటర్ల యజమానులు కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, దీంతో డిజిటల్ ప్రొవైడర్లకు ఛార్జీలు చెల్లించలేకపోతున్నారన్న కారణాన్ని చూపుతూ సినిమా ప్రదర్శనలు నిలిపివేసినట్టు మా దృష్టికి వచ్చింది. తెలంగాణలోనూ కొందరు థియేటర్ల యజమానులు.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఓ అసోసియేషన్ వల్లే థియేటర్లు మూతపడ్డాయంటూ వస్తున్న వార్తలను మేం ఖండిస్తున్నాం సినిమా థియేటర్ యజమానులుగానీ, మరే ఇతర అసోసియేషన్‌గానీ అపెక్స్ బాడీలకు (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి) ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కాబట్టి ’థియేటర్లు బంద్’ అనే ప్రచారంలో నిజం లేదు. మా సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తాయి‘ అని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు బుధవారం నుంచి పది రోజులపాటు ప్రదర్శనల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.