16-05-2024 RJ
సినీ స్క్రీన్
చిత్ర పరిశ్రమతో పాటు, యువతలోనూ క్రేజ్ సొంతం చేసుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవల ఆయన నటించిన ’ఫ్యామిలీస్టార్’ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ప్రతీ నటుడి దగ్గరకు కొన్ని కథలు వస్తుంటాయి. అన్నింటినీ అందరూ చేయలేరు కదా! అలాగే విజయ్ దగ్గరకు వచ్చిన ఓ నాలుగు కథలు వివిధ కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. వేరే హీరోలతో చేసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. విజయ్ దగ్గరకు వచ్చిన కథల్లో ’భీష్మ’ ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీ మంచి ఎంటర్‌టైనర్‌గా అలరించింది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలో సాగే కథను వెంకీ తొలుత విజయ్‌కు చెప్పారు. అయితే, కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయాల్సివచ్చింది. ఈ మూవీ నితిన్ కెరీర్‌కు మంచి హెల్ప్ అయింది. అటు పూరి జగన్నాథ్, ఇటు రామ్ కెరీర్‌లో మైలురాయిలా నిలిచిన చిత్రం ’ఇస్మార్ట్ శంకర్’.
తొలుత పూరి ఈ కథను విజయ్‌కు వినిపించారు. అయితే, డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ విషయంలో విజయ్‌కు కొన్ని అనుమానాలు ఉండటంతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కథ రామ్ దగ్గరకు వెళ్లడం, తన ఎనర్జీని వందరెట్లు పెంచి ’ఇస్మార్ట్ శంకర్’గా రామ్ అలరించడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా ’డబుల్ ఇస్మార్ట్’ రాబోతోంది. ఆ తర్వాత పూరి`విజయ్ కాంబోలో వచ్చిన ’లైగర్’ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువతను విశేషంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ’ఆర్‌సి 100’ ఒకటి. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, కార్తికేయకు మంచి కెరీర్‌ను అందించింది. తొలుత ఈ మూవీ దర్శకుడు అజయ్ పలువురు నటులను అనుకున్నారు. శర్వానంద్‌కు కథ వినిపించినా, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన వద్దనుకున్నారు. దీంతో విజయ్ దేవరకొండను సంప్రదిస్తే, అప్పటికే తాను చేసిన ’అర్జున్ రెడ్డి’ తరహాలోనే ఉంటుందని భావించి నో చెప్పారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో 2021లో వచ్చిన ’ఉప్పెన’ మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జోడీ నటనకు ఫిదా అయిపోయారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ. బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా ఉండగానే తాను విజయ్ దేవరకొండను దృష్టిలోపెట్టుకునే కథను డెవలప్ చేశారు. అయితే, అర్జున్‌రెడ్డి విడుదలైన తర్వాత విజయ్ రేంజ్ మారిపోవడంతో కథ ఆయనకు నప్పదని భావించారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాలో వైష్ణవ్‌ను చూసిన బుచ్చిబాబు.. సుకుమార్ ద్వారా మెగా కుటుంబాన్ని కలిసి కథ ఓకే చేయించుకున్నారు. అలా విజయ్ చేయాల్సిన కథలు వేరే వాళ్లు చేసి, ఘన విజయాలు అందుకున్నారు.