17-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 17: సురక్షితమైన రక్తం అందుబాటులో ఉండేలా చూడడానికి, జిల్లాకొక ప్రభుత్వ రక్త నిధి కేంద్రం స్థాయి పెంచడం ద్వారా నాణ్యమైన సేవలందించాలని సిఫార్సు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు జిల్లాలో అలాంటి రక్త నిధుల ఏర్పాటు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రక్తం సేకరించిన తేదీ, దాతపేరు, చిరునామా, వయస్సు, బరువు, హిమోగ్లోబిన్ శాతం, రక్తం గ్రూపు మొదలైన అంశాలను సూచిస్తూ రక్తదాతల రిజిస్టర్‌ను రక్త నిధి కేంద్రాలు నిర్వహించాలి. ఆరోగ్యంగా ఉండి రక్తదానానికి ఒప్పుకున్న దాత నుంచి మాత్రమే రక్తం సేకరించినట్టు సంచులపై సూచికలు అతికించాలి.
అంతేకాక నిర్ణీత ప్రమాణాలు లేని రక్త నిల్వలను నాశనం చేసేందుకు, రక్తమార్పిడి ద్వారా అంటురోగాలు ప్రబలకుండా చూసేందుకు ఇది దోహద పడుతుంది. దీనివల్ల రోగులకు అనుకూలంకాని రక్తం ఇచ్చే ప్రమాదం ఉండదు. జిల్లాలోని రక్త నిధి కేంద్రాలను కలుపుకుని రక్త నిధులన్నింటిలోనూ సేకరించిన రక్తపు యూనిట్లు, నిర్ణీత గడువులోగా ఉపయోగించకపోవడం వల్ల పడేయాల్సి వస్తోందని ఆడిట్ అధ్యయనంలో తేలింది. రక్తానికి బదులు కచ్చితం గా అవసరమైన భాగాలను మాత్రమే ఉపయోగించడం వల్ల రక్తాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.