17-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 17: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీకి ఓటు వేశారనే కారణంతో నలుగురిపై వైసీపీ మూకలు దాడులు చేశారని మహిళలపై కూడా పాశివికంగా దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. ఈ దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంవల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వైసీపీ రౌడీ మూకల ఇళ్లల్లో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో మారణ హోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప దాడులు ఆగే పరిస్థితి లేదని అన్నారు. విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన పోలీస్ అధికారులను బదిలీ చేయడమే కాకుండా.. వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.