17-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 17: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ మహిళ తన భర్త, అత్తపైనే హత్యాయత్నానికి పాల్పడిరది. ఈ దారుణ ఘటన బేగంబజార్‌లో కలకలం రేపింది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెలమండి సవిూపంలో ఓ కోడలు తన బంధువులతో.. భర్త, అత్తపై దాడి చేయించింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా వారిపై దాడికి పాల్పడ్డారు. అత్తను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని కోడలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు చూస్తుండగానే దుండగులు.. భర్త, అత్తలపై కత్తులు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. డయల్ 100కు ఫోన్ చేసినా స్పందన లేదని బాధితులు పేర్కొన్నారు. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. తమకు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.