17-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 17: హైదరాబాద్, విజయవాడ హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్, విజయవాడ హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్‌ని అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలను తగ్గించే అంశంపై డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈఎన్సీ గణపతి రెడ్డి, జాతీయ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఎన్ హెచ్ 65పై 17 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు జాతీయ రహదారుల శాఖ గుర్తించింది.
సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్ మెంట్స్, వెహికిల్ అండర్ పాస్‌ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రితో సమావేశం అనంతరం ప్రమాదాల నివారణకు చేపట్టబోతున్న పనుల్లో స్పష్టత రానుంది.ఈ రహదారిపై ఎక్కువ డ్యామేజ్ లు అయినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటిని సంస్కరించేందుకు చర్యలు తీసుకునే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అండర్ పాస్ లు ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధికారులతో మంత్రి చర్చించారు. చిన్నపాటి వర్షానికే నగర రోడ్లు నదులను మరిపిస్తున్నాయి. దీని ప్రభావంతో కిలోవిూటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాలనీలు జలమయం అవుతున్నాయి.
ఈ సమస్యల పరిష్కారానికి తీసుకోవాలల్సిన చర్యలపై అటు జీహెచ్‌ఎంసీ అధికారులతోనూ మంత్రి చర్చించారు. కొత్త రోడ్లు వేసే చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. దీనికి తోడు తాత్కాలికంగా వేసిన రోడ్లు డ్యామేజీ అవుతున్నాయి. వాటి మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి రివ్యూ చేస్తున్నారు. ఈ సమావేశంలో ఈఎన్సీ గణపతిరెడ్డి, నాయ్ ఆర్వో రజక్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.