17-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 17: కొద్ది రోజుల విరామం తరవాత తెలంగాణ మంత్రి వర్గం శనివారం సమావేశం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. కోడ్ కారణంగా ఏ పనీ చేయలేక పోయారు. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు సిఎం రేవంత్, మంత్రులు సచివాలయం నుంచి తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం జరుగనుంది. ఇందులో ప్రధానంగా రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్‌లో చర్చించనున్నారు.
ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్.. ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రెండు రాష్టాల్ర సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సవిూకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హావిూ ఇచ్చింది. దీని కోసం రూ. 34 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని అంచనా.
రైతు సంక్షేమం, అభివృద్ది కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న దానిపై రేవంత్‌కు క్లారిటీ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సవిూక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరుగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సవిూకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్ లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది.
స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. అలాగే కార్పోరేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపైనా చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఈ విషయంలో అస్సలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పాలన అనంతరం ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను హడావుడిగా అమలు చేశారు. ఆ పథకాల అమలు తీరుపైనా కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు చర్చించనున్నారు. అలాగే నెరవేర్చాల్సిన హావిూలు.. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపైనా మంత్రులతో .. కేబినెట్ భేటీ అనంతరం రేవంత్ చర్చించే అవకాశం ఉంది.