17-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, మే 17: తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది. అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు జోరువాన కూడా భక్తులను అడ్డుకుంటోంది. అయినా స్వామి దర్శనం కోసం క్యూలో పాట్లు పడుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయి.. ఔటర్ రింగురోడ్డులో 3 కిలోవిూటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం ఏర్పడిరది.