17-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు, మే 17: తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వారంతా వైకాపాకే కొమ్ముకాశారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తు ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. శుక్రవారం నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక మండలం మర్రిపాడులో ఒకటి నుంచి పది పోలింగ్ కేంద్రాల్లో నాటుబాంబుల సంస్కృతి ఉందని.. అలాంటి చోట్ల మహిళా కానిస్టేబుళ్లను నియమించారన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప భద్రత గురించి పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో తెదేపా ఏజెంట్లను అప్రమత్తం చేసి.. 3 వేల ఓట్లు రిగ్గింగ్ కాకుండా అడ్డుకున్నామన్నారు.
జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్‌కు ప్రజల సంక్షేమం పట్టదు.. మేకవన్నె పులిలా తిరిగారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రత్యక్షంగా చెప్పాను. జగన్ రాష్టాన్ని దోపిడీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమైనది. పాలనానుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు‘అని ఆనం అన్నారు.