17-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 17: ప్రతి పౌరుడు లబ్ది పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నగరంలోని హైటెక్స్‌లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. 40 శాతం విద్యుత్‌ను నిర్మాణరంగం వినియోగిస్తోంది. కర్బన ఉద్గారాలు సైతం వెలువడుతున్నాయి. హరిత భవనాల గురించి కొనుగోలు దారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలి. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీటి నిర్మాణం ప్రారంభమైంది.
ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రంలోని అప్పటి మన్మోహన్‌సింగ్ సర్కారు కఠిన చట్టాలను తీసుకొచ్చింది. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశాను. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మా ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఐటీ రంగంలో రూ.వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని శ్రీధర్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.