18-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 18: ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు. ఇసి అనుమతి లేని కారణంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడిరది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో కేబినెట్ భేటీని రద్దు చేశారు. శనివారం సాయంత్రం మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించింది. ఇందుకు సంబంధించిన అజెండాను కూడా సీఎస్ సిద్ధం చేశారు. కానీ, ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సచివాలయం నుంచి తిరిగి వెళ్లి పోయారు.
ఈసీ అనుమతి వచ్చినప్పుడే కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్లుండి లోపు ఈసీ అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఈసీ అనుమతి కోరాలని సీఎం నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాటు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న ఉండటంతో కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతించలేదని సమాచారం. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్, మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీని కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినెట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు. దీంతో చేసేదిలేక సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేసుకుంది. కానీ తెలంగాణ కేబినేట్ సమావేశం వాయిదా పడిరది. ఈసీ స్పందించకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సర్కార్ తెలిపింది. ఇదిలావుంటే పర్మిషన్ పై క్లారిటీ రాకపోవటంతో.. సెక్రటేరియట్ లో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సవిూక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ సహా.. ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎన్డీఎస్‌ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ సవిూక్ష అనంతరం కొద్దిసేపు వేచి చూసిన సీఎం, మంత్రులు.. అప్పటికీ ఈసీ నుంచి క్లారిటీ ఇవ్వకపోవడంతో సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో కొన్ని కీలక అంశాలను చర్చించలేకపోయామన్నారు. కేబినేట్ భేటీపై సోమవారం లోగా ఈసీ అనుమతి కోసం వేచి చూస్తామన్నారు. అవసరమైతే.. మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం చెప్పారు.