20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, మే 20: మిర్చి రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర తగ్గిపోతుందని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుందామంటే వాటి యజమానులు కూడా ఇష్టారాజ్యంగా అద్దెలు పెంచారని జిల్లా రైతు సంఘం నాయకులు విమర్శించారు. అక్రమంగా వసూళ్లు చేస్తున్నా అధికారులు, పాలకవర్గం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధిక కవిూషన్, మచ్చుల పేరుతో మిర్చియార్డులో అధిక వసూళ్ల దోపిడీని అరికట్టాలని అన్నారు. ఇప్పటినుంచే చర్యలు తీసుకుని వచ్చే మార్కెట్ నాటికి పక్కా ప్రణాళిక అమలు చేయాలన్నారు. కోల్డ్‌స్టోరేజ్‌లో సన్న, చిన్నకారు రైతులకు రుణ సౌకర్యం కల్పించాలని, మార్క్‌ఫెడ్‌కు వేయి కోట్లు కేటాయించి కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నారు. అలాగే కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు రూ.50 వేలు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఒక్క నెల్లూరులోనే రూ.3 వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి అన్నారు. ఈ స్కామ్‌పై సీఐడీ కాదు సీబీఐ లేదా జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపితేనే నిజాలు నిగ్గు తేలుతాయని సోమిరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే మిల్లర్లు మాయచేసి రైతులను నిలువునా ముంచుతు న్నారని కృష్ణా జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు పట్టపు నాని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల యజమానులు బయటి జిల్లాల నుంచి లారీలకొద్దీ ధాన్యాన్ని తెచ్చి నకిలీ రైతుల పేర్లతో బియ్యం చూపుతున్నారని, బిల్లులు చేసుకుంటున్నారన్నారు.
ఒక మిల్లుకు రెండు కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారెంటీ ఉంటే స్థానిక రైతులకు కోటి రూపాయల బిల్లులు చేసి, మిగిలినవి తమకు నచ్చిన రైతుల పేర్లతో చేసుకుంటున్నారని, ఈ అంశంపై రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మిల్లర్లు చేస్తున్న మోసం కారణంగా మూడు నెలలకు కూడా రైతులకు బిల్లులు అందట్లేదని, పెట్టుబడికి అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ తరహా మోసాలపై టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటుచేసి విచారణ చేయించాలని కోరారు.