20-05-2024 RJ
తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం, మే 20: పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. ప్రయివేటు రంగంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించాం. అయినప్పటికీ నిరుద్యోగులకు, యువతకు దూరం అయ్యామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన ఉద్యోగాల విషయంలో సరిగా ప్రచారం చేసుకోలేక పోయామని అన్నారు. అలాగే అబద్దాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని అక్కసు వెళ్లగక్కారు. పట్టభ్రద ఎమ్మెల్సే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కెటిఆర్ ప్రచారం చేశారు. ఇత్తందు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు.
ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఐదారు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టి, మొత్తానికి అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది. అధికారం కోల్పోయినందుకు బాధలేదు. అధికారం శాశ్వతం కాదు. మార్పు అని ఓటేసిన పాపానికి.. గత ప్రభుత్వంలో ఏం జరిగింది..? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది..? అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగులు, యువతకు మేం దూరమయ్యాం. గత పదేండ్లలో దేశంలో ఎక్కడా చేయని విధంగా ఉపాధి కల్పన కల్పించాం.
2014 నుంచి 2024 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఉద్యోగ నియమాకాలు జరిగాయో లెక్కలతో సహా విూ ముందు పెడుతాం. ఈ దేశంలో ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన జరగలేదు. విూరేన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పండి అని అడిగితే కాంగ్రెస్, బీజేపీ నాయకుల వద్ద సమాధానం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పని చయలేదని సోషల్ విూడియాలో దుష్పచ్రారం జరిగింది. చదువుకున్న యువత ఈ వాదనకు ఆకర్షితులై మాకు దూరమయ్యారు. దయచేసి వాస్తవాలను తెలుసుకోవాలని మనవి.
మేం ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని మేం ప్రచారం చేసుకోలేదు. అది మా తప్పు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రాదు కాబట్టి ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించాం. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాం. దాదాపు 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించాం. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఉపాధి కల్పనకు ప్రయత్నం చేశామని కేటీఆర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాను చేయడమే కాకుండా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. వైద్య విద్య చదవే అవకాశం దొరికింది. కొత్తగూడెంలో కూడా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దే.
65 ఏండ్లలో తెలంగాణలో ఏర్పాటైంది 3 మెడికల్ కాలేజీలు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 33 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాం. విద్యావ్యాప్తి, ఉపాధి కల్పనకు, ప్రయివేటు రంగంలో పెట్టబడులకు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కృషి చేశామని కేటీఆర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ఓ విద్యావంతుడు పోటీ చేస్తున్నాడు.. కాంగ్రెస్ తరపున ఓ బ్లాక్ మెయిలర్ పోటీ చేస్తున్నాడు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ప్రజా జీవితంలోకి వచ్చిన విద్యావంతుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి. కాబట్టి ఓటేసే ముందు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటేయాలని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.ఇప్పుడు మనకు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు.. ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. మనకు కావాల్సింది ధిక్కారు స్వరాలు.. అధికార స్వరాలు కాదు. ఇవాళ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మందబలం ఉంది. మాట తప్పినా మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరనే ధీమా ఉంటది. అదే మండలిలో మన నాయకులు ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే అవకాశం ఉంటుంది.
పచ్చి అబద్దాలు చెప్పి రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నాడు . ఆరు గ్యారెంటీలకు ఐదు గ్యారెంటీలు అమలు చేశానని రేవంత్ నిస్సిగ్గుగా చెబుతున్నాడు. ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే అమలైంది. ఫ్రీ బస్సుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నాట్లప్పుడు కేసీఆర్ రైతుబంధు వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి రైతుబంధు వేశారని టీఆర్ పేర్కొన్నారు. నాట్లప్పుడు రైతుబంధు వేస్తే లాభం.. కోతలప్పుడు వేస్తే ఏం లాభం అని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయం బాగైంది.
2014లో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉండే. 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరి ధాన్యంలో హర్యానా, పంజాబ్‌ను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది. రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిండు. నాకు ఒక్క అవకాశం ఇస్తే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ అన్నాడు. జూన్ 9 వస్తుంది.. ఆరు నెలలు గడిచిపోయింది. కానీ రుణమాఫీ కాలేదు. హావిూలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేయాలంటే.. దమ్మున్న ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలన్నారు.
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలి. విూరు ఉదాసీనంగా ఉంటే మరిన్ని అబద్దాలాడుతూ, అసలు హావిూలే ఇవ్వలేదని అంటారు. మొదటి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ హావిూ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని బుకాయిస్తున్నాడు దబాయిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు.
కేసీఆర్ హయాంలో టెట్‌కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేసిండు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టిండు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హావిూ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.