20-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 20: తెలంగాణాలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. అయితే అక్రమంగా కార్డులు ఉన్నవారు, అర్హత లేకున్నా పొందిన వారు స్వచ్ఛందంగా కార్డులు వాపస్ చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవు తాయన్నారు. ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లి లో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
గ్రామాల్లో సమస్యలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాలు అందజేసిన ప్రజలు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. విూ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచానని, అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని విూ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కోసం శ్రమించి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. విూ ఇంటి పెద్దకొడుకుగా విూ అందరి కోసం పనిచేస్తా అని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజల వద్దకె శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రఘురాం రెడ్డి గెలుపు కోసం కూడా అందరూ కృషి చేశారన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం లేకుండానే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని మంత్రి హావిూ ఇచ్చారు.పార్టీలకు అతీతంగా పేద వాళ్లలో అతి పెదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పాలేరులో ఏ ఒక్కరూ మంచినీటికి ఇబ్బంది పడకుండా చర్యలు చేపడతామన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. నిజమైన పేదవారికి సేవ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. పాలేరు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోనన్నారు. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం పాలేరు ప్రజల మధ్యే ఉంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.