20-05-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, మే 20: బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు జూటా హావిూలు.. ఇదీ రేవంత్ పాలన అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దేవరకొండలో హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వంద రోజుల హావిూ అమలు కాలేదు.. విద్యార్థి భరోసా కార్డు రాలేదు.. స్కూటీ, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి అమలు పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతులెత్తేశారు అని హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హావిూ కూడా అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు.. ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వలేదు.
మెరుగైన పీఆర్‌సీని ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యావంతులు, నిరుద్యోగుల్లారా.. ఆలోచన చేసి ఓటు వేయాలి.. విూ ఓటుతో గుణపాఠం చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలించాలి అని హరీశ్‌రావు కోరారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. యాజమాన్యాలు, విద్యావంతులు ఆలోచన చేసి ఓటు వేయాలి. జర్నలిస్టులకు వంద కోట్లు ఇస్తామని, వంద పైసలు కూడా ఇవ్వలేదు. వంద పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి.
కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే? రాకేష్ రెడ్డిని గెలిపించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో సోమవారం దేవరకొండకు హరీశ్‌రావుకు చేరుకుని రవీంద్ర కుమార్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.