20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 20: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు గుర్తించారు. ఈ దమనకాండపై రెండు రోజులపాటు విచారణ జరిన సిట్.. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ జరిపింది.
రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందు పరిచింది. మూడు జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు సిట్ వెల్లడిరచింది. క్షేత్రస్థాయిలో పోలీసులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు పేర్కొంది. 33 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ ప్రకారం 1,370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటి వరకు 124 మంది అరెస్టయ్యారని తెలిపింది. మిగతావారిని కూడా అరెస్ట్ చేయాలని సూచించింది.
రెండు వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చింది. కేసుల దర్యాప్తులోనూ తీవ్ర లోపాలు గుర్తించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైనా సిట్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా అనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా సిట్ నిర్థరించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా.. మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్ అధికారులపైనా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది.
ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా కొన్ని సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను డీజీపీ.. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ప్రభుత్వం ద్వారా అందించనున్నారు. ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు 13 మంది సభ్యులతో సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ పూర్తి చేసింది. సోమవారం సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు. 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి సమర్పించారు. ఇప్పటికే పలు స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారు. ఘర్షణ తీవ్రతను బట్టి పలు ఠాణాల్లోని నమోదైన కేసులకు సంబంధించి కొన్ని సెక్షన్లు మార్పులు చేయాలని సిట్ నివేదికలో ఉన్నట్లు.. కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అంశాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ దమనకాండపై రెండు రోజులపాటు అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపింది. ప్రతి అంశాన్ని సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.
అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పరివేక్షణ ఇకపై కూడా చేయనునుంది. కేసుల పరివేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ సిద్దం చేయనుంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మరణాలకు దారి తీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులకు ర్యాలీలు, కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పరివేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది.
అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదైనట్లు పేర్కొంది. 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు రాళ్లదాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలిపింది. అల్లర్లలో పాల్గొన్న మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ, వ్తెసీపీకి చెందిన 91 మందిని అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరో ముగ్గురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. కాగా.. తాడిపత్రిలో నమోద్తెన కేసులలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఉన్నారు.