20-05-2024 RJ
సినీ స్క్రీన్
సుమారు ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత మంచు మనోజ్ వెండితెరపై కనిపించనున్నారు. అదే విషయాన్ని మనోజ్ తన పుట్టినరోజైన మే 20న తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ’మిరాయి’ సినిమా నుండి మనోజ్ పాత్ర చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు, తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్న, ఈ సినిమాని పీపుల్స్ విూడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన అభిమానులను ఉద్దేశించి ఒక భావోద్వేగ మాటలు చెప్పారు. సుమారు ఎనిమిది సంవత్సరాలు అయింది, నేను సినిమాలు చేసి. ’ఎందుకంటే నాకు మెయిన్ అమ్మ అంటే సినిమా, విూరందరూ నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటే అది సినిమా వల్లే కదా. అందుకే నేను సినిమా చెయ్యాలి అనుకొని గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కథలు వింటూ వస్తున్నాను.
నాకు ఏదైనా కొత్తగా చెయ్యాలి, ఏది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలి, సినిమా కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నాకు సినిమా నచ్చి, కథ నచ్చి చెయ్యాలని అలా వెతుక్కుంటూ వెళ్లాను,’ అని చెప్పారు మనోజ్. నేను సినిమాలు మళ్ళీ చేద్దాం అనుకున్న సమయంలో ఎన్నో కథలు వచ్చాయి, వింటూ ఉన్నాను. అందులో కొన్ని నచ్చాయి కానీ అవి ఏవో కారణాలతో కుదరలేదు, నాకు కొన్ని నచ్చలేదు, నిరాశ పడ్డాను, వేచి చూసాను, ఓపిక అంటే ఏంటో తెలుసుకున్నాను, అప్పుడు ఓపిక విలువ ఏంటో కూడా తెలుసుకున్నాను,’ అని చెప్పారు మనోజ్. ఆ సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు వచ్చారు, అలాగే తేజ సజ్జ కి కూడా థాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అతనే ఈ కథని నా దగ్గరకి పంపి ఒక్కసారి విను అని చెప్పాడు. నువ్వు నేను కలిసి చెయ్యాలి, స్క్రిప్ట్ వినాలి అని చెప్పారు తేజ సజ్జ.
ఇది అదిరిపోయే స్క్రిప్ట్, రెండు భాగాలుగా వస్తుంది, పార్టు వన్, పార్టు 2 లలో వస్తుంది, మొదటి పార్టు ఏప్రిల్ 18, 2025లో విడుదలవుతుంది, ఇంతకంటే ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, అని తన గురించి చెప్పారు మనోజ్. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా ఇవాళే.. అందుకే తన మిత్రుడు తారక్‌కి పుట్టినరోజు శుభాకాంక్షులు తెలిపారు. ’దేవర లో పాట విడుదలైంది, అదిరిపోయింది. నువ్వు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండు బాబాయ్’, అని జూనియర్ ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు చెప్పారు మనోజ్. అలాగే ఈరోజు ’కన్నప్ప’ టీంకి కూడా టీజర్ లాంచ్ చేస్తున్నారని, తన అన్న విష్ణుకి, టీముకి విషెస్ తెలియచేసారు మనోజ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఈరోజే, ఆయన్ని మిస్ అవుతున్నాం, అయన దీవెనలు ఉండాలి మనకి అని తన మాటలను ముగించారు మనోజ్.