21-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 21: ఎన్నిచర్యలు తీసుకున్నా, అధికారులు పర్యవేక్షిస్తున్నా రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. గత్యంతరం లేని రైతులు మధ్య దళారులకే విక్రయిస్తున్నారు. ధాన్యం అమ్మకాల్లో రైతులు ఏటా సమస్యలు ఎదుర్కొంటున్నా వారిని పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గిందని ఓ వైపు ఆందోళన చెందుతుంటే మరోవైపు పంట కొనుగోళ్లు లేక కలవరపడుతున్నాడు. నిబంధనల పేరిట ప్రభుత్వరంగ సంస్థలు ఇబ్బంది పెడుతుంటే.. దళారులు ధర తగ్గించి పంట కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాల్లో దళారులది ఆడిరదే ఆటగా మారింది. మొదట్లో పంట బాగానే ఉన్నా అకాల వర్షాల వల్ల పంట కొంత దెబ్బతింది. కొనుగోలులో అవకతవకలు జరుగకుండా ఉండాలనే ఆలోచనతో రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులను కూడా జారీ చేశారు.
మధ్య దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండాలనే ఆలోచనతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా తేమశాతం పేరుతో తరుగు తీస్తున్నారు. అయితే అధికారులు నిబంధనలు పెట్టడంతో ఇప్పుడు పల్లెల్లోకి దళారులు వచ్చి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కూడా కొందరు తూకంలో మోసానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో ఇలా ఏ గ్రామానికి వెళ్లినా మధ్య దళారులు ఇలా రైతుల ఇంటికి వెళ్లి తక్కువ ధరకే నేరుగాకొనుగోలు చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా వ్యవసాయాధికారులుగానీ, మార్కెటింగ్ అధికారులుగానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.