21-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఏలూరు, మే 21: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామలక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే హనుమద్వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రోడ్లపైకి తరలి వచ్చారు. కాగా రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారిని అధికారులు ఊరేగిస్తారు. ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా ద్వారకా తిరుమల శ్రీవారి వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయ నిత్యకల్యాణ మండప ఆవరణలో విశేష అలంకరణలో అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లు కొలువుతీరగా.. నడుమ ఉన్న చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. ఉభయదేవేరులు పెండ్లి కుమార్తెలయ్యారు. ఉదయం ఏర్పాటు చేసిన సువర్ణ సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కల్యాణమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు హారతులిచ్చి ఈ తంతును నిర్వహించారు. ఈవో త్రినాథరావు ఆద్యంతం పాల్గొని అర్చకులు, పండితులకు దీక్షా వస్త్రాలను అందచేసి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.