21-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 21: సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది. ఇది కక్షసాధింపు చర్య అని వస్తున్న విమర్శలను పక్కన పెట్టింది. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు. ఆ ఆదేశాలపై హైకోర్టులో సవాల్ చేసింది. ఆ కేసు ఈ నెల 23వ తేదీ రోజున విచారణ జరగనుంది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలని క్యాట్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది.
తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని అభిప్రాయ పడిరది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారు. కొనుగోలు అంశంపై గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా వినిపించుకోలేదు. 2019లో వైసీపీ అధికారం చేపట్టడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి జగన్ సర్కార్ తప్పించింది. 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చెరవేశారని కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించింది. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు.
తొలిసారి క్యాట్, కేంద్ర హోంశాఖలో ఊరట కలుగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. బాధ్యతలు చేపట్టే సమయంలో మరోసారి ఆంధప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దానిపై మరోసారి క్యాట్‌ను ఆశ్రయించగా విచారించింది. ఏబీవీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను జగన్ సర్కార్ ఇప్పటికీ పాటించడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు. క్యాట్ తీర్పు కాపీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీ వెంకటేశ్వర రావు పంపించారు. పోస్టింగ్, జీతభత్యాల గురించి అందులో ప్రస్తావించారు. ఆ ఫైల్‌ను సీఎం జగన్‌కు సీఎస్ పంపించారు. సీఎం జగన్ ఆదేశాలతో క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రోజున హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఆ కేసు విచారణ గురువారం జరగనుంది.