21-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 21: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ తీరును బీజేపీ నేత, భువనగిరి ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తప్పు పట్టారు. వరికి బోనస్ ప్రకటన గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సన్నం వడ్లకే బోనస్ ఇస్తామనడం సరికాదని అభిప్రాయపడ్డారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని సూచించారు. లేదంటే బాక్స్ బద్దలవడం ఖాయమని హెచ్చరించారు. రైతులతోపాటు విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని బూర నర్సయ్య మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయి ఎందుకు విడుదల చేయడం లేదని అడిగారు. కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు రూ.4 వేల కోట్లు ఉంటాయ్.. ఫీజు రీయింబర్స్ మెంట్ మాత్రం చెల్లించరని మండిపడ్డారు.
పేదలకు చేసిన చికిత్సకు సంబంధించి రూ.1400 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయి కూడా పెండిరగ్‌లో ఉందని ధ్వజమెత్తారు. ఉద్యోగుల డీఏను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బూర నర్సయ్య గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హావిూలను సీఎం రేవంత్ మరచిపోయారని విమర్శించారు. చేస్తానని చెప్పిన పనులను వెంటనే చేపట్టాలని కోరారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. గత ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించిందని గుర్తుచేశారు. మరోసారి దశాబ్ది ఉత్సవాలు అవసరమా..? అని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు.