21-05-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, మే 21: నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2 లక్షల ఉద్యోగాల మాటే లేదు.. నిరుద్యోగ భృతి ఊసే లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఖమ్మం ? నల్లగొండ ? వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 4 లక్షల 70 వేల మంది పట్టభద్రులు ఉన్నారు. మరి అరచేతిలో వైంకుఠం చూపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా..? పదేండ్ల పాటు నిజాయితీగా పని చేసిన బీఆర్‌ఎస్‌కు ఓటెద్దామా..? ఒక గోల్డ్ మెడల్ సాధించి ప్రజాసేవకు అంకితమైన రాకేశ్ రెడ్డికి ఓటేద్దామా..? విూడియా, యూట్యూబ్ అడ్డం పెట్టుకుని దందాలు చేసే చీటర్లకు ఓటేద్దామా..? అనేది ఆలోచించాలని పట్టభద్రులకు కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం.. జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డీఎస్సీ ముచ్చటనే లేదు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ అంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఉద్యోగాలు ఇచ్చామని డైలాగులు కొడితే నమ్మేందుకు మనం పిచ్చొళ్లామా..? కాంగ్రెస్ చెప్పిన 2 లక్షల ఉద్యోగాల మాటే లేదు. మీ తరపున కొట్లాడాలి అంటే మాకు బలమివ్వాలి.
ప్రభుత్వం ఐదు నెలల్లో అన్ని వర్గాలను మోసం చేసింది. ఐదు నెలల్లోనే ఐదేండ్ల అపఖ్యాతిని మూటగ్టటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడైనా ఆలోచించి ఓటేయండి.. ఆగం కాకండి. ఎవరి వల్ల లాభం జరుగుతదో ఆలోచించాలి. బ్లాక్ మెయిలర్లు, దందాలు చేసేటోళ్లకు అవకాశం ఇస్తే సమాజానికి తీవ్ర నష్టం. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే గ్రాడ్యుయేట్లు సరైన తీర్పునివ్వాలి. ఈ ఎన్నికల్లో రాకేశ్ రెడ్డికి ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వం నిలదీసే అవకాశం ఉంటుంది అని కేటీఆర్ అన్నారు.