21-05-2024 RJ
తెలంగాణ
వరంగల్, మే 21: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వరంగల్‌లో మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అక్రమ డబ్బులు వసూలు చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షానే స్వయంగా ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి చెప్పారంటే.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ వాళ్లు ఆవురావురుమన్నట్లుగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. ఎప్పటివరకు అధికారంలో ఉంటామో తెలీదని.. వీలైనంత తొందరగా అంతా సర్దుకుని పెట్టుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే కాంగ్రెస్ వాళ్లకు సపరేట్ ఫీజు కట్టాల్సి వస్తుందని.. లేదంటే పర్మిషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలు భిక్ష పెడితే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి వచ్చిందని తెలిపారు. ప్రజలు దెబ్బకొడితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని స్పష్టంచేశారు.