21-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, మే 21: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరుపతి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మళ్లీ తిరుపతి నుంచి తిరిగి బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మనవడి తలనీలాలు సమర్పించేందుకు రేవంత్ కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లారు. నేటి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభమవడంతో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకోనున్నారు.
రాత్రికి రచనా అతిథిగృహంలో రేవంత్ బస చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా బాలాజీని దర్శించు కోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రచనా అతిథిగృహం వద్ద రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తన మనవడి పుట్టెంట్రుకలను రేవంత్ కుటుంబ సభ్యులు స్వామి వారికి సమర్పించనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని రేవంత్ దర్శించుకోనున్నారు. అనంతరం రేపు (బుధవారం) తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
కాగా ఈరోజు( మంగళవారం) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో పరిశ్రమల భవన్‌లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సవిూక్షా సమావేశం నిర్వహించారు. అయితే సీఎం రేవంత్ తిరుమల పర్యటనతో పలు శాఖలపై ఈరోజు సాయంత్రం నిర్వహించాల్సిన సవిూక్షలు, ఇతర కార్యక్రమాలు రద్దు చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.