21-05-2024 RJ
సినీ స్క్రీన్
సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కొన్ని రోజులపాటు మూసి వేస్తున్నామంటూ ఒక పక్క ప్రకటనలు వస్తుంటే, ఇంకో పక్క, సుమారు ఒక అరడజను సినిమాలు మే 31న విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు. ఆలా ప్రకటించిన వాటిలో సుధీర్ బాబు నటించిన ’హరోం హర’ సినిమా కూడా వుంది. జ్ఞానశేఖర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకుడు, మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. చిత్తూరు నేపథ్యంలో జరిగిన ఒక పీరియడ్ డ్రామా ఇది. సుధీర్ బాబు, తన మామయ్య కృష్ణ గారి పుట్టినరోజు అయిన మే 31 సందర్భంగా ఈ సినిమా విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి విడుదల చెయ్యలేకపోతున్నామని, జూన్ 14 కి విడుదల వాయిదా వేశామని చెపుతున్నారు.
మే 31 మిస్ అయినందుకు ఒక పక్క బాధగా వున్నా, జూన్ నెలలో విడుదల చేస్తున్నందుకు తనకి బాగా కలిసి వచ్చిన నెల అది అని చెపుతున్నారు సుధీర్ బాబు. ఎందుకంటే తన సినిమాలు ’సమ్మోహనం’, 'ప్రేమ కథా చిత్రం' ఈ జూన్ నెలలోనే విడుదలై మంచి విజయాలు సాధించాయని చెపుతున్నారు. ఇప్పుడు ఈ ’హరోం హర’ కూడా ఈ జూన్ 14న విడుదలై తనకి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నట్టుగా చెపుతున్నారు సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు చిత్తూర్ యాసలో తన మాటలు చెపుతారని, ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.