22-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, మే 22: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారి హరీంద్రనాథ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మెక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్ధప్రసాదాలు అందేశారు.
తెలంగాణ రాష్టాల్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచెప్పారు.సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కూతురు, మనవడు, అల్లుడితో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకంటే ముందు ఉదయం తన మనవడి పుట్టెటెంటుకలను స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలగి ఉండాలని ఆకాంక్షించారు.
రెండు తెలుగు రాష్టాల్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని రేవంత్ చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో నీటి సమస్యలు తీరాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణతో పాటు.. ఆంధప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని సీఎం రేవంత్ చెప్పారు.