22-05-2024 RJ
తెలంగాణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 22: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు మండలం అందుగులగూడ చెరువులో మంగళవారం విష ప్రయోగం జరిగింది. అందుగులగూడ గ్రామానికి చెందిన మత్స్యకారులు చెరువులో చేపలు పెంచుతున్నారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి చెరువులో విషప్రయోగం చేసినట్లు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయల ఖర్చు చేసి చెరువులో చేపలు వేసినట్లు వారు తెలిపారు.
విష ప్రయోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే విషప్రయోగమా? ఎండ వేడిమికి తట్టుకోలేక చేపలు చనిపోతున్నాయా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సంఘటన స్థలాన్ని మాజీ సర్పంచ్ కొమరం హనుమంతు సందర్శించి చెరువును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.