22-05-2024 RJ
తెలంగాణ
నర్సంపేట, మే 22: మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ్యాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచి కూడా వారికి దూరమయ్యాం. ఇలా చేసింది చెప్పుకోలేక ఓడిపోయామన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఈ ఎన్నికలతో ఫలితంలో ప్రభుత్వం కూలిపోయేది లేదు. తారుమార అయ్యేది లేదు. 6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్‌తో సహా అందరం ప్రతి నియోజవర్గంలో పర్యటించాం. దయచేసి మోసపోకండి.. గోసపడుతామని చెప్పాము. కానీ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
చదువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాలన గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ప్రస్తుతం వ్యవసాయం పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అందమైన నినాదాలు ఎక్కడున్నాయో ఆలోచించండి. నాకు ఓటు వేస్తే 2 లక్షల రుణమాఫీ దస్త్రంపై డిసెంబర్ 9న తొలి సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి హావిూ ఇచ్చాడు. అర్జంట్‌గా బ్యాంక్‌కు వెళ్లి 2 లక్షల రుణం తెచ్చుకోవాలని కూడా సూచించారు. డిసెంబర్ 9 పోయింది.. మరో పది రోజులు అయితే జూన్ 9 వస్తది. ఆరు నెలలు గడిచిపోతది. తొలిరోజే సంతకం చేస్తానని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాలని గ్రాడ్యుయేట్లను కేటీఆర్ కోరారు. రైతు భరోసా 15 వేలు ఇస్తా.. భూయజమాలకు కాదు కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తానని రేవంత్ నమ్మబలికాడు. రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తానని అన్నాడు. కౌలు రైతులకు రైతు భరోసా రాలేదు.
తొలిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పు. రెండోసారి కూడా వాడి చేతిలో మోసపోతే మనది తప్పు అయితదని కేటీఆర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టెట్ పరీక్ష ఫీజు రూ. 20 వేలు చేస్తరని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విూ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గళాన్ని మండలికి పంపించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. 50 వేలతో మెగా డీఎస్సీ అన్నాడు. ఈ రెండు అమలు కాలేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు. అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు. లీగల్ సమస్యల వల్ల ఆగిపోయాయి. కేవలం కాగితాలు ఇచ్చి తాను ఇచ్చానని ఊదరగొడుతున్నారు. విచక్షణ కలిగిన విద్యావంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. సమాజానికి దిక్సూచిగా ఉంటూ, దిశానిర్దేశం చేసేది విూరే.. విూరు కూడా మళ్లీ మోసపోతారా..? లేదా మేల్కొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి అవకాశం ఇస్తారా..? ఆలోచించుకోవాలి.
బీఆర్‌ఎస్ తరపున రాకేశ్ రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. రాకేశ్ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టారని అన్నారు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, వెకిలి పనులు చేసుడు కాంగ్రెస్ అభ్యర్థి లక్షణం. దందాలు చేయడం, బెదిరించడం వంటి కేసులు నమోదైనట్లు కాంగ్రెస్ అభ్యర్థి అఫిడవిట్‌లో ఉన్నాయి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్‌లో 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆడపిల్లల ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, అనుమతి లేకుండా అమ్మాయిల ఫోన్ నంబర్లను ఫేస్‌బుక్‌లో పెట్టిన కేసులు, బ్లాక్ మెయిల్ చేసిన కేసులు.. ఇలా 56 క్రిమినల్ కేసులు ఉన్న మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి అభ్యర్థుల గుణగణాలు చూడాలి. మండలిలో వైట్ కాలర్ వర్కర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిలర్ ఉండాల్నా ఆలోచించండి. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే నర్సంపేట యువత తరపున రేపు మండలిలో గల్లా పట్టి అడిగే పరిస్థితి మాత్రం ఉంటదని అన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ ఉంటది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో విూరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా మోసాన్ని గ్రహించి ఓటేయకపోతే నష్టపోయేది విూరే. నోటిఫికేషన్లు ఇవ్వకపోపోయిన పట్టభద్రులు ఓటేశారు అని ప్రభుత్వం అనుకుంటది. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా మాకు ఓటేశారు అనుకుంటారు. ఒక్క పరీక్షకు కూడా ఫీజు ఉండదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ ఫీజు రూ. 400 ఉండే. ఇప్పుడు రూ. 2 వేలు అయింది. మళ్లీ వాళ్లకు ఓటేస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు చేయరా..? ఆలోచించండి. పదేండ్లలో తెలంగాణలో ఎంతో ప్రగతి సాధించాం. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయి. ఐటీ ఎగుమతులు పెరిగాయి. పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.