22-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 22: గత ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. పదేళ్లు లేని కరెంట్ కోతలను మళ్లీ చూస్తున్నామన్నారు. విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడి చూస్తున్నట్లు తెలిపారు. మోటార్లు కాలుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతున్నాయని ఎద్దేవా చేశారు. మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నట్లు చెప్పారు. సాగునీరు పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు దర్శనమిస్తున్నాయి.
పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు వస్తున్నాయి. రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం. విత్తనాల కోసం రైతుల మొక్కులు.. క్యూలైన్ లో పాసుబుక్కులు చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో. ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల విద్యుత్ కోత బాధాకరం. ఆసుపత్రులను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోంది. కరెంటు కోతలు లేవని సీఎం, మంత్రులు పదేపదే అంటున్నారు. ఆసుపత్రుల్లో కరెంట్ కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.