22-05-2024 RJ
సినీ స్క్రీన్
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఫిల్మ్ ’దేవర’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ’మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ’దేవర’లో పాత్ర గురించి మాట్లాడారు. ’ఇందులో ’తంగం’ పాత్ర పోషిస్తున్నాను. అది ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్ చాలా సరదాగా జరిగింది. సెట్‌లోని వారంతా నాపై ఎంతో ప్రేమగా ఉంటారు. చిత్రయూనిట్ అంకితభావానికి ఆశ్చర్యపోయాను. ఇది విభిన్నమైన కథ. అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ’దేవర’లో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని చెప్పారు.
తాజాగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. త్వరలోనే రెండో పాట విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఓ సందర్భంలో దర్శకుడు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఆయన అభిమానులకు ’దేవర’ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పడంతో దీనిపై అంచనాలు రెట్టింపయ్యాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల దీని విడుదలను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.