22-05-2024
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, మే 22: తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ కొనసాగింది. ఉదయం శ్రీభు సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమలపెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నామని, ఉదయం 6.35 గంటల నుంచి స్వామివారు రథంపై, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఇదిలావుంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్తోక్తర్రగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7 .30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 23న ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ గణెళిశ్ పాల్గొన్నారు.