24-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 24: ఒక్క అవకాశం ఇవ్వాలని..ఒక్కసారి అధికారం ఇస్తే.. అంటూ చేసిన ప్రకటన వెనక ఉన్న కుట్రలు, కుతంత్రాలు ఎంత దారుణంగా ఉంటాయో ఎపిలో పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో హింసను సృష్టించడం చూశాం. అధికారంలో ఉంటే ఎలా దాడులు చేయవచ్చు.. ఎలా దోచుకోవచ్చో చూశాం. అభివృద్ది అన్నది లేకుండా రాష్టాన్న్రి అధోగతి పాల్జేసిన వైకాపా తీరుతో ఎపి నష్టపోవడం ఖాయం. ఇప్పటికే అభివృద్ది వెనక్కి పోయింది. రాజధాని లేకుండా పోయింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు అవకాశం లేకుండా చేశారు. దీనిని బట్టి ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలి. అధికార యంత్రాంగాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలి. అధికారంలో ఉండడం వల్ల ఎన్ని అరచకాలు చేయవచ్చో వైకాపా నిరూపించింది. ఈ క్రమంలో కేంద్రం చట్టం తీసుకుని రావాలి. ఎన్నికలకు ముందు రాష్ట్రప్రభుత్వాలు మనుగడలో లేకుండా చేయాలి. అప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. అధికారులు చెప్పినట్లు వింటారు. కానీ ఎపిలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం వల్ల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.
ఎమ్మెల్యేనే పోలింగ్ బూత్‌లో చొరబడి ఈవీఎంను పగలగొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం దారుణమైన ఘటనగా చెప్పుకోవాలి. దీనికి అధికార పక్షమైన వైకాపా సాధానం ఇచ్చుకోవాలి. ఆ ఎమమెల్యేపై చర్య తీసుకోవాలి. ఈ వ్యవహారాన్ని సమర్థించుకోవడం సరికాదు. పోలింగ్ జరిగిన రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టడమే కాకుండా బయటకు వచ్చి సాగించిన హింసాకాండకు సమాధానం ఇచ్చుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రజల్లోలోకి రావడంతో అసలు నిజ స్వరూపం తెలిసింది. ఆ తర్వాతనే ఈసీ ఆదేశాలతో ఆయనను పోలీసులు అరెస్టు చేయబోతే.. కనిపించ కుండా పోవడంపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ ఇరకాటంలో పడిపోయిందనే చెప్పాలి. తమ ఎమ్మెల్యే వ్యవహారాన్ని సమర్థించుకునే ప్రయత్నాల్లో ఉక్కిరిబిక్కిరవుతోంది.
చంద్రగిరిలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడతో ఆ నియోజకవర్గంలో కొన్ని బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని వైకాపా నేతలు కోరడం చర్చనీయాశంగా మారింది. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే..దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల వాదనలను తెరపైకి తెస్తోంది. వీడియోలో ఉన్న విషయాన్ని చర్చ నుంచి పక్కకు నెట్టేందుకు అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటూ ఆ పార్టీ నాయకులు కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం సరైందా కాదా అనే విషయంలోకి వెళ్లకుండా.. సంబంధం లేని వాదనలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పిన్నెల్లి వెళ్లిన బూత్‌లోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, వాటికి సంబంధించిన వీడియోలు బయటకు ఎందుకు రావడం లేదంటూ వైకాపా నాయకులు అడ్డంగా వాదిస్తున్నారు.మాచర్ల, సత్తెనపల్లి,గురజాల, నరసరావుపేట, పొన్నూరు, చంద్రగరి, బాపట్ల, మార్కాపురం, కుప్పం, గంగాధర నెల్లూరు, టెక్కలి, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, రాయచోటి, జగ్గయ్యపేట తదితర నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వైకాపా నేతలు గురువారం ఫిర్యాదు చేశారు.ఈ నియోజకవర్గాల్లో తెదేపా కార్యకర్తలు రిగ్గింగు, బూత్ క్యాప్చరింగులకు పాల్పడ్డారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఆరోపిస్తున్న బూత్‌లకు సంబంధించిన వీడియోలనూ బయట పెట్టాలంటూ పిన్నెల్లి వ్యవహారాన్ని పక్కదారిపట్టించే ప్రయత్నం చేసారు. అయితే ఇదంతా ఎన్నికల కౌంటింగ్ వరకు జరగవచ్చు. ఫలితాల్లో అనుకూలంగా ఉంటే ఫర్వాలేదు. లేకుంటే మరెంత హింసకు పాల్పడుతారన్నది గుర్తించి మసలుకోవాలి.