24-05-2024 RJ
తెలంగాణ
మేడ్చల్, మే 24: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షావిూర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు శిఖం భూముల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎప్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్ ,రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.
కాగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని, కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15మంది పేర్కొంటున్నారు. అయితే ఆ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పోలీసులకు 15మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ భూముల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మల్లారెడ్డి బాధితులు సమావేశం నిర్వహించారు.
మరోసారి మల్లారెడ్డిపై బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. పూలు, పాలు అమ్ముడే కాదు... మల్లారెడ్డి భూ కబ్జాలు కూడా చేస్తున్నాడు. పేట్ బషీరాబాద్‌లోని 82 సర్వే నంబర్‌లో ఎకరం 29 గుంటల కన్నా.. ఎక్కువ ఉంటే విూకు సారీ చెప్పి రాజకీయాల నుంచి వెళ్లిపోతానని మల్లారెడ్డి చెప్పాడని... కానీ మమ్ముల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. రెవెన్యూశాఖ అధికారులు ఆదివారం చేసిన సర్వేలో 82 సర్వే నంబర్‌లో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు.. మాకు చెందిన 33 గుంటలు అందులో కలిసిపోయింది. మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలు వదిలేసి.. మా 33 గుంటలను మాకు పొజిషన్ ఇప్పించాలి. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముందే ఈ సర్వే జరిగింది. మల్లారెడ్డి మాట విూద నిలబడాలి‘ అని బాధితులు పేర్కొన్నారు.