24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: నగరంలో మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. కేరళకు చెందిన యువకుడి మృతితో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిగా గుర్తించారు. కొంతకాలంగా పేదలకు డబ్బు ఆశ చూపి విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేస్తూ దందా సాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న యువకుడు మృతి చెందడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేరళలో ఓ యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి ఈ మధ్యనే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడని, అందుకు దళారులు రూ.20లక్షలు ఆశ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సబిన్ అనే దళారిని కోచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విచారించారు.
కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్, మరో ముగ్గురు కలిసి దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. యువకుడిని ఇరాన్ తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేశారని, రూ.20లక్షలు ఇస్తామని చెప్పి రూ.6లక్షలే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్, కేరళకు చెందిన 40మంది యువకులను ఇరాన్ దేశం తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది పేదలే ఉన్నట్లు వారు తెలిపారు. నగరానికి చెందిన ఒక వైద్యుడితోపాటు మరో ఇద్దరు దళారుల కోసం కేరళ పోలీసులు వెతుకుతున్నారు. కేరళలోని ఎర్నాకులం కేంద్రంగా వ్యవహారం నడుపుతున్నారని, పేదలను టార్గెట్ చేసుకుని నగదు ఆశ చూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని కేరళ పోలీసులు పేర్కొన్నారు.