24-05-2024 RJ
తెలంగాణ
కామారెడ్డి, మే 24: సాధారణంగా విద్యుత్ షాక్తో ఒకరిద్దరూ మృతిచెందుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుటాం... కానీ గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఒక్కసారిగా తండాలోని అన్ని నివాసపు ఇళ్లకు విద్యుదాఘాతం అవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ముగ్గురు తండావాసులు ప్రమాదానికి గురికాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, ఏదో ఒక ఇంటికి కాకుండా గ్రామంలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ రావడం అధికారుల అలసత్వానికి నిదర్శమని గ్రామస్థులు అన్నారు. అధికారుల తీరుపై వారు మండిపడ్డారు. కొండాపూర్ సబ్ స్టేషన్ను ముట్టడిరచి నిరసన తెలిపారు. దేవుడి దయతో తామంతా ప్రాణాలతో బయటపడ్డామని, ఒకవేళ తాము మరణించి ఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని కొందరు... స్థానిక అధికారులను ప్రశ్నించారు. మరమ్మతులు త్వరగా చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లేనిపక్షంలో తమ ఆగ్రహం చవిచూస్తారని గ్రామస్థులు హెచ్చరించారు.