24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కానీ అధికార పార్టీ నాయకులే తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నా బంధువుకు రూ. 10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించారు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు నకిలీ కథ అల్లారు. కేంద్ర హోం మంత్రి నకిలీ వీడియోను రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను సీఎం పోస్టు చేశారు. మరి నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టరు అని కేటీఆర్ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఇకపోతే టీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ప్రచారం విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు, మద్దతుదారులపై కేసులు నమోదు చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్రచారం చేసిన ఎన్టీవీ, బిగ్ టీవీ చానెల్స్, వెలుగు దినపత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని అడిగారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని కేటీఆర్ హెచ్చరించారు.