24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: ఈనెల 27న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేనందున తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో సూచించారు. ప్రైవేటు కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టులు సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.